నువ్వు నాకు సారీ చెప్పడమేమిటన్నా?

ప్రసాదు ఆరోజు కూడా మామూలుగానే మెళ్ళో బిళ్ళ వేలాడేసుకొని ఎనిమిది గంటలకు ఆఫీసుకు బయల్దేరాడు. కొంతమంది నడుముకున్న బెల్టులో కనపడీ కనపడకుండా దాచుకుంటారు కానీ ప్రసాదుకు అలా యిష్టముండదు. మెడలో వేసుకొని గర్వంగా తన ఫోటో, కంపెనీ పేరు అందరికీ చూపించడమంటే సరదా. ఈ రోజు కూడా మరో మామూలు రోజు, నాలుగు పురుగులు, ఆరు ఫిక్స్ లు అనుకుంటూ బయల్దేరాడు కానీ అది ఒక అసాధారణ దినం అవుతుందని ఆ క్షణంలో ఆయనకి తెలీదు.

క్యాబ్ కోసం ఎప్పటిలాగానే కరంటు స్థంబం నీడలో ఒంటరిగా ఎదురుచూస్తూ నిల్చున్నాడు. ఆ స్టాపులో ఎక్కేది అతనొక్కడే. ఎక్కువ మంది ఒక కిలోమీటరు అటూ-ఇటూ ఉన్న రెండు స్టాపుల్లో ఎక్కుతుంటారు.

రోజూ వచ్చే టైం దాటి పది నిమిషాలయింది, కానీ క్యాబ్ మాత్రం రాలేదు. ఎదురు చూసీ, చూసీ విసుగొచ్చింది. రోడ్డుకు అటువైపు ఉన్న చెఱకు రసం స్టాలు వైపోసారి చూశాడు. ఇప్పుడే మిషను స్టార్ట్ చేశాడు అంతలోనే అటు పక్క ఉన్న బస్టాండు నుండి ఐదుగురు గ్లాసులు ఆర్డర్ చేశారు.

ప్రసాదు మరో ఐదు నిమిషాలు ఎదురుచూశాడు క్యాబ్ అజాపజా లేదు. ఈ రోజుకిక ఆటోనే గతి, వంద బొక్క అనుకుంటూ మరోసారి చెఱకురసం స్టాలు వైపు చూశాడు. సూర్యభగవానుని కృపాకటాక్షాలవల్ల అతని వ్యాపారం దివ్యంగా సాగుతుంది. ప్రసాదుక్కూడా నోరూరింది. అటువైపు మూడంటే మూడు అడుగులు వేశాడు… అంతే ….

* * *

ప్రసాదు ౨౪ గంటల తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ఎడమచేతికి, కుడికాలికి కట్లు కట్టి వున్నాయి. ఆశ్చర్యంతో వాటిని చూసేసరికి ‘కదలకు, డాక్టరును పిలుస్తానుండు’  అంటూ రూమ్మేట్ బయటకు వెళ్ళాడు. ప్రసాదు ఆశ్చర్యంలోనుండి తేరుకోకముందే బిలబిలమంటూ కెమేరాలు, మైకులు, రికార్డర్లు పట్టుకొని రాష్ట్రంలో ఉన్న అన్ని చానల్లూ ఒకేసారి ఆనయ్యాయి. వారేమంటున్నారో ప్రసాదుకు అర్థం కాలేదు. ఇంతలో ఇద్దరు పోలీసులు లోపలికొచ్చి, సారొస్తున్నారంటూ అందరినీ బయటికి పంపేశారు.

వచ్చిన సారును చూసి ప్రసాదు కళ్ళు మిలమిలా మెరిశాయి. ఆ తర్వాత మందారపూలలా వికసించాయి. నోరు ఇంత లావున తెరుచుకుంది.

వచ్చింది ఆంధ్రుల అభిమాన, సారీ ప్రసాదు అభిమాన తార ‘రాయ్’

రాయ్ అలా నడుస్తూ వచ్చి ‘సారి’ అంటూ ప్రసాదు చెయ్యి నొక్కాడు షేక్ హ్యాండిస్తూ. అప్పటిక్కానీ ప్రసాదు ఈ లోకంలోకి రాలేదు.

“ఏమయిందన్నా, నువ్వు నాకు సారీ చెప్పడమేమిటన్నా?”

‘నీకేం గుర్తు లేదా?’

గుర్తుకు తెచ్చుకోటానికి ప్రసాదు ప్రయత్నించకముందే రాయ్ మళ్లా మాట్లాడాడు. ‘హడావుడిలో నా కారు నీకు డాషిచ్చింది. రోజూ డ్రయివరే నడుపుతాడు కానీ నిన్నెందుకో అలా అయింది. సారీ’

అప్పటిగ్గానీ ప్రసాదుకు చెఱకు రసం గుర్తుకు రాలేదు.

“ఛా! నువ్వు భలేవాడివన్నా. ఈ మాత్రానికే నువ్వొచ్చి సారీ చెప్పాలా? ఫోన్ చేస్తే సరిపొయ్యేదిగా. అయినా ఒక చెయ్యికేగా దెబ్బ తగిలింది, రెండో చెయ్యి బాగానే వుందిగా. నేనేమనుకోనులే నీ కారుగదా.”

రాయ్ ఏదో మాట్లాడబొయ్యేంతలో ప్రసాదు రూమ్మేటు తలుపు తోసుకొని వచ్చాడు. అతనితోపాటు బెటాలియన్ మొత్తం మళ్ళా దిగింది.

టపీటపీ మని ఫ్లాష్ లైట్లు వెలిగాయి.

చెప్పండి సార్, ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది? రాయ్ గారు తాగి డ్రైవ్ చేశారంటున్నారు ప్రత్యక్ష సాక్లులు…..

వారిని మాట్లాడనివ్వకుండా ప్రసాదు గట్టిగా “అబ్బే అదేమీ లేదు. నేనే తొందరలో రోడ్డు దాటుకుంటూ సూర్యుడు కళ్ళల్లో పడటంతో వస్తున్న కారు చూడలేదు. అంతే ఇందులో అన్న తప్పేం లేదు.”

ఇంతలో డాక్టరు, నర్స్ వచ్చారు. వారి వెనుక పోలీసులొచ్చి అందరినీ బయటకు పంపారు.

* * *

తరువాత రోజు బాగున్న చేత్తో ఒక దాని తర్వాత ఒక న్యూస్ పేపరు చూస్తూ వాటిల్లో పడ్డ తనూ రాయ్ కలిసున్న ఫోటోలు చూసుకుంటూ మురిసిపోతుంటే, రూమ్మేట్ లోపలికి వచ్చాడు.

పలకరింపులయ్యాక,

‘ఏం రా, అంత పెద్ద అబద్దమాడావు? ఎంత ఫానయితే మాత్రం?’

“ఏం అబద్దం?”

‘తూర్పున ఉన్న సూర్యుడు పడమర తిరిగివున్న నీ కంట్లో ఎలా పడతాడురా?’

“అయ్యో! అన్నకేమన్నా ట్రబులయిద్దేమోరా. పోనీ అన్నను చూడటానికి నేనే కారుకు అడ్డం వెళ్ళానని చెప్పనా? ”

* * *