సంధి కాలంలోని భారత రాజ్యాంగ రచన గురించి ….

గ్రాన్ విల్ ఆస్టిన్ రచించిన భారత రాజ్యాంగం దేశానికి మూల స్తంభం, పుస్తకం బాగుంది. ప్రభాకర్ మందార అనువాదం కూడా బాగుంది. సామాన్యునికి ఈ అనువాదం చేరువలో ఉంది.

గ్రాన్ విల్ ఆస్టిన్ కొండకచో కాంగ్రేసు వీరాభిమానిలా ఉన్నాడు, అయినా ఇది చదవదగ్గ పుస్తకమే. గతంలో నాకు రామచంద్ర గుహ (ఇతను కూడా నెహ్రూ వీరాభిమానిలా కన్పించాడు నాకు) పుస్తకాల్లో దొరకని సమాధానాలు ఈ పుస్తకంలో దొరికాయి. అసలు భారత దేశం ఇంకా ఎందుకు కలిసి ఉంది? తెలుగు దేశం, తమిళ దేశం, .. ఇలా ఎందుకు విడిపోలేదు? ఈ ప్రశ్నలకు గుహ కంటే ఆస్టిన్ పుస్తకమే సరిఅయిన సమాధానాలు అందించే మూలాలు కలిగి ఉంది.

నిజానికి ఈ పుస్తకం చదువుతుంటే, ఇటీవలే చూసిన బ్యాటిల్ ఫీల్డ్ గలాక్టికా సీరియల్ గుర్తు వచ్చింది. అందులో భూమి పూర్తిగా నాశనం అయి, కేవలం విమానాల్లో ఉన్న మానవులు మాత్రమే మిగులుతారు. 1947.. నాటికి భారత దేశం కూడా దేశ విభజన, మతకల్లోలాలు, తెలంగాణా సాయుధ తిరుగుబాటు, భాషా సమస్యలు, గాంధీ హత్య, సంస్థానాల విలీనం, యుద్దం వంటి పలు సంక్లిష్ట పరిస్థితిలో ఉంది. అటువంటి సమయంలో కుదురుగా కూర్చొని భవిష్యత్తును దర్శిస్తూ, నిర్దేశిస్తూ రాజ్యాంగాన్ని వ్రాయడం మాటలు కాదు.

మిగతా దేశాల రాజ్యాగాలకూ, భారత దేశ రాజ్యాంగానికి ఒక ప్రధానమైన తేడా ఉంది. మిగతా రాజ్యాంగాలు స్వాతంత్ర్యానికి ముందో, తరువాతో వ్రాసుకున్నవి. కానీ భారద దేశ రాజ్యాంగం మాత్రం సంధికాలంలో వ్రాసుకున్నది. అంటే యుద్ధంలో నేరుగా చేరి, గాయైలవుతున్నా లెక్కించకుండా, కత్తి తిప్పడంలో మెళుకువలు పెంపొందించుకోవడం వంటిది. అప్పుడు యుద్ధం రాకపోతే, కేంద్రానికి ఇంత అధికారం ప్రాప్తించేది కాదేమో. అప్పుడు నెహ్రూ, రాజేంద్రప్రసాదుల మధ్య సయోధ్య అలా లేకపోతే రాష్ట్రపతి మరీ ఇలా రబ్బరు బొమ్మకాడేమో, తెలంగాణా వంటి సంఘటనలు లేకపోతే, రాష్ట్రాలకు మరిన్ని హక్కులు ఉండేవేమో. దేశవిభజన మరింత ముందు జరిగి ఉంటే భాషల విషయంలో దేశం మరో విధంగా ఉండేదేమో.

న్యాయశాఖ హక్కుల గురించి, భాషల గురించి, మతం గురించి, అల్పసంఖ్యాక వర్గాల గురించి, కార్యనిర్వాహక శాఖ గురించి, పంచాయితీల గురించి, గాంధీగారి గ్రామ స్వరాజ్యం గురించి ఇలా పలు విషయాలు చక్కగా వివరించారు ఈ పుస్తకంలో, ఆనాడు ఏఏవ్యక్తులు అతివాదులుగా, మితవాదులుగా ఉన్నారో చదువుతుంటే ఆసక్తికరంగా ఉంది. తప్పకుండా చదవాల్సిని విషయం ఉన్న పుస్తకం ఇది. ప్రచురణ హైదరాబాద్ బుక్ ట్రస్ట్. కినిగెలో ఈపుస్తకం మరియు ప్రింటు పుస్తకం రెండూ లభ్యం.

భారత రాజ్యాంగం – దేశానికి మూల స్తంభం On Kinige