ముత్యాలమ్మ కథలు: విందు

ఈ రోజు ‘జేజి’ మహోత్సాహంగా వుంది. అంటే నాన్నకి తెలియకుండా ఏదో పెద్ద ప్లాన్ వేస్తుందని అర్థం. పాపం నాన్న! గతంలోని రెండు మూడు ప్లాన్‌లు గుర్తొచ్చాయి నాకు. చేతిలోని కర్రతో భూదేవిని టింగ్, టింగ్ మని పొడుస్తూ ‘పెద్దోడా!’ అని పిలుస్తూ నా వంక పరిగెత్తుకొచ్చింది.

“నోరిప్పుడెలా వుంది?” అంటూ అడిగింది. నాకు నిన్నటినుండి నోరు పూసింది. ఏదో చెబుదామని నోరు తెరిచాను. ఇంతలో, “ఆ పచ్చళ్ళు వాడికి పెట్టొద్దంటే విన్లేదు” అంటూ అమ్మ కూడా జాయిన్ అయింది. ఇహ నేనేం చెప్పక్కర్లేదని నాకు తెలుసు.
అమ్మ చేతిలో టీ గ్లాసు “జేజి” కిచ్చి, నా వైపు తిరిగి డాక్టరులాగా నానోరు, నాలుక, బుగ్గలపై, నుదుటిపై వచ్చిన పొక్కులు పొద్దెండ వెలుగులో పట్టి పట్టి చూసి ఏం మాట్లాడకుండా ఇంట్లోకి దారి తీసింది. ఆమె ఎక్కడకు వెళ్తుందో నాకు తెలుసు – ఆ మందులు డబ్బా దగ్గరకే.
అప్పటివరకు దూరదూరంగా పనులు చేసుకుంటున్న ఎంకడు జేజి దగ్గరకొచ్చి ఏదో చెప్పబోయేంతలో జేజి వాడిని మాట్లాడనీకుండా కోడలు మందులు తేటానికి బోయిందిగాని, నువ్వు వీణ్ని తోలుకపోయి మఱ్ఱి చెట్టు ఊడ ఒకటి పెరికి నమిలించు.” అంటూ తొందరపెట్టింది.
“బతికాన్రా బాబు అనుకుంటూ మఱ్ఱి చెట్టు కేసి నడవబోతుంటే మళ్ళా జేజి గొంతు వినిపించింది.” నేఁ జెప్పిన పనేం చేశావ్?” దానికి వంతగా ఎంకడు” అంతా నువ్ చెప్పినట్టే చెప్పా” అని నాతోపాటు మఱ్ఱి చెట్టువైపు కదిలాడు.
***
మఱ్ఱి ఊడ నములుతూ నెమ్మదిగా తోటలోనుంచి వస్తుంటే వినిపించిందా ఆర్తనాదం. ఒళ్ళంతా ఒక్కసారిగా జలదరించింది. హృదయ వికారంగా ఉంది. గట్టిగా ఉలిక్కిపడ్డాను. ఎంకడు మాత్రం నవ్వి నా వీపు మీద అరచేత్తో కొట్టాడు. ఆ దెబ్బకు ఈలోకంలోకి వచ్చిపడ్డాను. ‘ఏమిటది’ అన్నట్టు ఎంకడు వైపు చూశా. “ఇయ్యాల ముత్యాలమ్మ గదా! మేక తల తెగింది” అంటూ ముందుకు దారి తీశాడు.
వెళ్ళేసరికి జేజి అక్కడే వుంది. కాకుంటే నిలబడకుండా నాపరాయిమీద సతికిలబడింది. పక్కనే ఖాళీ అయిన టీగ్లాసు, దానిమీద ఒకటి రెండు ఈగలు. చేతిలో మరో లోటా ఉంది.
అమ్మ కూడా మందుల డబ్బా పట్టుకొని రెడీగా వుంది. గడ్డిపరకలు గీరుకొని ఎర్రగా అచ్చులు పడ్డ నా చేతులు చూస్తూ “అలా తోటలో తిరగొద్దన్నాగా” అంటూ అడిగింది. “తిరక్కుండా ఇంట్లో ఉంటే పొద్దు ఎలా పోద్దే కోడలా!” అంటూ చేతికర్రతో నేలను గట్టిగా పొడిచి లేచి ఆ చేతిలో ఉన్న లోటా నాకేసి చాస్తూ “ఇంక నమిలింది చాల్లేగాని, ఆ పుల్ల అవతల పడేసి పుక్కిలిచ్చి వూసి ఈ పటిక నీళ్ళు తాగు” అని. ఆ తర్వాత అమ్మవైపు తిరిగి “నోరు పూస్తే అన్ని గొట్టాలెందుకే రెండు రోజుల్లో మానిద్దిలే” అంది. ‘ఇహ లోపలికెళ్ళి పని చూసుకో’ అని కళ్ళ తోనే జేజి అనడంతో అమ్మ మరేం మాట్లాడకుండా లోపలికెళ్ళింది.
అప్పుడు మరోసారి విన్పించింది ఆ హృదయవికార ఆర్తనాదం.
జేజి నా వైపు వింతగా చూసింది. నేను పట్టిచ్చుకోకుండా గాబు దగ్గరకెళ్ళి పుక్కిలిచ్చి ఊసి లోటాలో పటిక నీళ్ళు నెమ్మదిగా తాగసాగాను. ఏమాటకామాటే చెప్పుకోవాలి, చాలా హాయిగా ఉంది.
వెనక్కి తిరిగి చూస్తే, నాన్న వేగంగా జేజి దగ్గరకు వస్తూ కన్పించాడు. ”అమ్మా! నువ్వు చెప్పావని రెండు కోయించాను. కూర మిగిలిపోద్దేమో అనిపిస్తుంది.”
జేజి ఒక నవ్వు నవ్వి “ఈ వూరోళ్ళు ఎంత తింటారో నీకు తెలీదురా. రెండు కాదు, ఇరవై ఏటలయినా సరిపోవు” అంది.
ఎంకడు టీ తాగుతూ ముసిముసిగా నవ్వుకోసాగాడు.
***
హడావుడి పదకొండింటికే మొదలయింది. పన్నెండింటికే మూడు బంతులు లేచాయి. జేజి అక్కడే కూర్చుని చుట్ట తాగుతూ వచ్చే వాళ్ళనో, పొయ్యేవాళ్ళనో గట్టిగా పలకరిస్తూంది. చాలా సార్లు ఏదో ఒకటి అనటం – వాళ్ళతో పాటు పగలబడి నవ్వటం. మూడోబంతి అయ్యాక జేజి చెప్పడంతో ఎంకడు, నాన్న ఇంకా అప్పటిదాకా వడ్డించినోళ్ళు అందరూ కూర్చున్నారు. తమ్ముడు ఎంచక్కా నాన్న పక్కన సెటిల్ అయ్యాడు. ఒక్కక్షణం నేను కూడా ఆ నాలుగో బంతిలో కూర్చోవాలనుకున్నా కానీ అసలే నోరు పూసింది అంత కారం తింటానో లేదో అని గమ్మునున్నాను. ఇంతలో అమ్మవచ్చి “నీకు కారం లేకుండా కూర తీశాను, తర్వాత చెల్లితో పాటు తిందువుగానిలే” అనడంతో హమ్మయ్య అనుకున్నా.
***
నాన్న చెయ్యి కడుక్కొని జేజి కాడకొచ్చి
“అమ్మా! కూర ఇంకా చాలా ఉన్నట్టుంది?”
“పిలిచినోళ్ళందరూ వచ్చినట్టేనా?”
“ఆఁ!”
“ఆ సుబ్బయ్య కనబళ్ళేదు?”
“వాడికి ఒంట్లో బాగోలేదమ్మా”
“అవునా! ఈ సారేమయింది?”
“జొరం”
“అవున్రా! ఊళ్ళో రెండు వీధులేనా?”
“అమ్మా!”
“సర్లే, ఎలాగూ కూర మిగిలిందిగా. నీళ్ళు కాగి వున్నాయి. బియ్యం యసట్లో పొయ్యమనిచెప్పు. ఆ ఎంకడును పిలిచి మిగతా రెండు వీధులను కూడా రమ్మను.”
ఒక్కక్షణం నాన్న ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత ఎంకడు ఎక్కడ వున్నాడో అని వెనక్కి తిరిగి చూశాడు. అందుకోసమే ఎదురు చూస్తున్నట్టు ఎంకడు ముందుకొచ్చాడు.
జేజి మరోసారి కర్ర టిక్కు టిక్కు అనిపించుకుంటూ వంటల దగ్గరకెళ్ళి గిన్నెలన్నీ మూతలు తీసి మళ్ళా మూతలు పెట్టింది. బాపయ్య దగ్గర కెళ్ళి యసట్లో బియ్యం పోశావా? అని అడిగింది. పోశానన్నట్టు తలూపాడు. జేజి ఒక్కక్షణం ఆలోచించి “ఉల్లిగడ్డలు ఇంకొన్ని కోయించు. మరీ సన్నగా కాకుండా పెద్ద ముక్కలు చెయ్యి” అని నావైపు తిరిగింది.
“అన్నం తిన్నావా?”
‘లేదు’ అన్నట్టు తలూపాను.
“ఆకలెయ్యడంలేదా?”
అవునన్నట్టు, కాదన్నట్టు తలూపాను.
“సర్లే- నోటిపూత ఎలా వుంది?”
నేనేదో చెప్పబోయేంతలో మళ్ళీ జేజే “రెండ్రోజుల్లో తగ్గిపోతుందిలే. మీ అమ్మని మాత్రం ఆ మందుల డబ్బాకాడికి పోనీకు”
అనేసి నాపరాయి దగ్గరకెళ్ళి సెటిల్ అయి చుట్ట వెలిగించింది.
***
అప్పుడే వచ్చిన ఎంకడుతో…
“అందర్నీ కేకేశావా?”
“ఆఁ!”
“కూర చూసి వడ్డించు. ఆ గోలయ్యకు మాత్రం గిన్నె ఇవ్వకు. వాణ్ని అన్నమే వడ్డించమను” అని చెప్పింది.
పిలవడమెందుకు? పిలిసి కూర చూసి వడ్డించడమెందుకు? అని అనుకున్నాను కానీ ఆఖరి బంతి అయిన తర్వాత గాని అర్థం కాలేదు జేజి అలా ఎందుకన్నదో. కూర మొత్తం అయిపోయింది. ఏదో అడుగూ బొడుగూ మిగిలింది. అన్నం కూడా అంతే. జేజి అలా అనకపోతే గోలయ్య రెండు బంతుల ముందే కూరంతా పందేరం చేసేటోడు. పిలిచి పీకలదాకా వడ్డించడంతో పాటు, పిలిచినోళ్ళందరికీ వడ్డించడం ముఖ్యమే గదా! దానికి తోడు కూర అయిపోయి అన్నం మిగిల్తే ఇంకా నామోషిగదా.
***
ఆరోజు సాయంత్రం తీరుబడిగా కూర్చొని జేజి నాతో “మీ నాన్న దేశాలు తిరిగి సంపాయించుకొచ్చాడేగాని పల్లెటూళ్ళో ఎట్ట బతకాలో తెలీదు.” అంది.
***

సినిమా గొడవలకు పరిష్కారం ః సైన్స్ ఫిక్షన్ సినిమాలు మాత్రమే

ఆ కులపోళ్ళను తిట్టాడనీ,

ఈ ప్రాంతపు వారిని తిట్టాడనీ,

ఇలాంటి గొడవలకు లేకుండా తెలుగు సినిమాలు తియ్యాలంటే కేవలం సైన్స్ ఫిక్షన్ సినిమాలు తియ్యడమే మార్గం.

అందులో అయితే స్టోరీలో ప్రాంతాలకతీతంగా, కులాలకతీతంగా వ్రాసుకోవచ్చు. కావల్సిన సందేశాలూ ఇచ్చుకోవచ్చు. అడిగోవాడుండడు. (చూసేవాడూ ఉండడంటే నేనేం చెయ్యలేను, ఎక్కడో ఒక చోట మొదలంటూ ఉండాలి కదా …. )

తెలుగు సైన్స్ ఫిక్షన్ రచయత(త్రు)ల ఆంగ్ల బానిసత్వం

తెలుగులో సైన్స్ ఫిక్షన్ రచయతలు, భవిష్యత్తులో ఏదో ఒక గొప్ప సాంకేతిక అద్భుతాన్ని సృజిస్తారు, కానీ దాని పేరు మాత్రం ఆంగ్లంలోనే పెట్టేస్తారు!

మన వాళ్ల ఈ భాషా దరిద్రాన్ని కనీసం ఊహాలోకంలో అయినా వదలగొట్టలేమా?

మంచి మంచి తెలుగు పేర్లు తెలుగు ఆవిష్కరణలకు పెట్టుకోలేమా. సైన్స్ ఫిక్షన్ అనంగనే సగం ఆంగ్లం వాయించాల్సిందేనా? ఆ మాత్రం దానికి తెలుగులో చదువుకోవడం ఎందుకు, అంతకంటే మంచి మంచి సైన్స్ ఫిక్షన్ ఆంగ్లంలో కుప్పలు తెప్పలుగా సిద్ధంగా ఉంది కదా.

 

సైన్స్ ఫిక్షనులో మీరు సృజించే లోకాన్ని పూర్తి తెలుగు లోకంగానే ఉంచండి. ఏమీ రసాభస కాదు. ఇంకా చదవడానికి ఇంపుగా ఉంటుంది. భవిష్యత్తు తరానికి తెలుగు పదాలు సిద్ధం చేసిన వాళ్లమూ అవుతాము.