సీనియర్ సుండర్

నమస్కారం,

నా పేరు స్వరం. నేనొక వ్రాతగాన్ని. ఇదే సంవత్సరం క్రితం అయితే నేనొక జర్నలిస్టుని అని చెప్పుకునేవాడిని. మీ ఊహ కరక్టే, సంవత్సరం క్రితం నా ఉద్యోగం ఊడింది. ఎందుకు ఊడింది అంటారా? నిజాయితీగా చెప్పాలంటే నాకింకా అర్థం కాలేదు. ఆ విషయం అర్థం చేసుకునేంత పరిణత నాకుంటే బహుశా నా ఉద్యోగం పొయ్యివుండేది కాదేమో అని చాలాసార్లు అనుకున్నాను. ఏదేమైనా ఈ చిన్ని పుస్తకం ఉద్దేశ్యం నా గుఱించి కాదు కాబట్టి ఇక్కడితో నా ప్రవర ఆపుతాను.

నాకు ఉద్యోగం పొయ్యి (పాఠకులు క్షమించాలి మళ్ళా నా గుఱించే మాట్లాడుతున్నందుకు) జేబులోని కాగితాలు, బ్యాంకు క్రెడిట్ లిమిట్ చూసుకుంటూ బితుకు బితుకుమంటూ రోజులీడుస్తున్నప్పుడు నాకు వచ్చిన స్వర్ణావకాశం ఇది.

నా గత ఉద్యోగం తాలూకు మిత్రులు గట్టిగా రికమెండ్ చెయ్యడంతో సుండర్ ఎస్టేట్ నుండి నాకు ఆహ్వానం వచ్చింది. ఆ రోజు ఉదయమే నేను చెప్పిన టైం కన్నా పదినిముషాలు ముందే గేట్ ముందు ఆటో దిగాను. నేను వస్తానన్న సమాచారం ముందే ఉండటంతో నా కోసం సుండర్ సెక్రటరీ (సెక్రటరీలలో ఒకరు అని తరువాత తెలిసింది) ఎదురుచూస్తున్నాడు. నన్ను తీసుకొని లోపలికి వెళ్ళాడు.

నేను వెళ్ళేసరికి జానియర్ సుండర్ డైనింగ్ టేబుల్ వద్ద ఉన్నాడు. నన్ను కూడా మర్యాదగా అక్కడికి ఆహ్వానించారు. మిసెస్ సుండర్ కూడా అక్కడే ఉన్నారు. ఆ రోజు తిన్న పూరీలు, ఆలూ కర్రీ ఇంకా మర్చిపోలేదు. ఆ తర్వాత ఇచ్చిన కాఫీ కూడా. నన్ను చాలా మాట్లాడనిచ్చారు. వాళ్ళు కూడా చాలా మాట్లాడారు. నేను పుట్టిన ప్రాంతం, చదివిన చదువు, కులం, గోత్రం, చేసిన ఉద్యోగాలు – ఇంకా ఫలానా వ్యక్తి ఎలా తెలుసు? ఫలానా వారితో నా అనుబంధం ఎటువంటిది? …. ఈ విధంగా చాలా ప్రశ్నలూ జవాబులూ పూరీలతో పాటు ఆ డైనింగ్ టేబుల్ పై విస్తరించాయి.

ఇప్పుడు ఇది వ్రాస్తుంటే అనిపిస్తుంది, నేను హాజరైన ఇంటర్వ్యూలలో ఇదే సొగసైనదీ పరిపూర్ణమైనదీ, తెలివైనదీ అని.

ఆ రోజు నాకు చాలా మంచి రోజు. ఇటీవలనే కీర్తిశేషులైన సీనియర్ సుండర్ గారి గుఱించి ఒక పుస్తకం వెలువరించాలని, దానికి గాను నాకు నెలకు ‘ఇంత’ అని ఇచ్చేట్టు ఒప్పందం కుదిరింది. ‘ఇంత’ అని వ్రాశాను గానీ, అది నాకు చాలా ఎక్కువ. నా ఊడిపొయిన ఉద్యోగపు జీతం కంటే చాలా ఎక్కువ. ఒక్కోసారి ఉద్యోగాలు ఊడిపోవడం కూడా మంచిదే.

* * *

ఆ పుస్తకం పని అనుకున్నది అనుకున్నట్టు వెళ్తే ఇప్పుడు నేనిలా వ్రాస్తూ ఉండవలసిన అవసరం లేదు. అంటే నేను సరిగ్గా పనిచెయ్యలేదని కాదు. నేను ఇరవైనాలుగు గంటలూ అదే పనిలో ఉన్నాను. ఎన్నో పుస్తకాలు చదివాను. అంతర్జాలంలోని ఎన్నో పుటలు నమిలి మింగాను. వందలాది మందిని కలిసి మాట్లాడాను. దేశం మొత్తం తిరిగాను. దేశం దాటి కూడా వెళ్ళి వచ్చాను. పుస్తకం మొత్తం సిద్ధం అయింది. ఇచ్చిన సమయం కంటే కొద్దిగా ఆలస్యం అయింది అనుకోండి, కానీ నేను మాత్రం పూర్తి న్యాయం చేశాను.

కానీ ఆ తర్వాత జరిగిన సంఘటనలు నాకు అసలు అర్థం కాలేదు. ఇష్టంగానూ లేవు. నా పుస్తకం వెలుగు చూడలేదు. ఇహ ఎప్పటికీ వెలుగు చూడదు అని నమ్మకంగా తెలిసింది. నా డబ్బులు నాకు ముట్టినాయనుకోండి. అయినా మనం వ్రాసింది వెలుగు చూడకపోతే ఆ బాధే వేరు. నేను చేసిన పనంతా ఎక్కువగా నాకు కేటాయించిన ఆఫీసు, ఇల్లు నుండే చేయడం వల్లా, నాతో ముందే ఉన్న ఒప్పందం వల్లా ఆ పుస్తకం చిత్తు ప్రతి కూడా నా వద్ద లేదు. అందులోని విషయాలు నేను కూడా మర్చిపోకముందే పేపరుపై పెడుతున్నాను. నేనేమీ దీన్ని ప్రచురించే ఉద్దేశ్యంతో ఈ పని చేయడంలేదు. నా వృత్తి, ప్రవృత్తి రెండూ వ్రాయడమే. వ్రాయకుండా ఉండలేను కదా.

* * *

ముందుగా నేను కలుసుకున్న వ్యక్తులు సీనియర్ సుండర్ గుఱించి ఏమి చెప్పారో చూద్దాం.

* * *

మిసెస్ సుండర్:

ఈవిడ చాలా బాగా మాట్లాడుతారు. నా ఇంటర్వ్యూ సమయంలో కూడా చాలా ప్రశ్నలు అడిగారు. వీరిని నేను చాలాసార్లు కలిశాను. అవి అన్నీ ఇప్పుడు గుర్తులేవు, గుర్తున్నంతవరకూ…

“మేము ఈ ప్రాంతం వాళ్ళం కాదు. ఉత్తరాది నుండి ఇక్కడకు వచ్చాము. అసలు మా వారికి ఇక్కడికి ఎందుకు రావాలన్పించిందో నాకు తెలీదు. నా వివాహం నాటికి మాది ఇరువైపులా కలిగిన కుటుంబమే. తరతరాల నుండి వ్యాపారాలు విజయవంతంగా చేస్తున్న కుటుంబాలు మావి. ఈ ప్రాంతానికి రావడాన్ని నేను వ్యతిరేకించాను. కానీ ఆయన వినలేదు. ఆ రోజుల్లో ఇప్పటిలా ఆడవారి మాటలకు అంత విలువ లేదు. మా కుటుంబాల్లో మరీ! ఏమాటకామాటే చెప్పుకోవాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నిరాశకు గురైన సందర్భాలు చాలా తక్కువ, వేళ్ళమీద లెక్కించవచ్చు. ఇక్కడికి రావటం మా మామగారికి యిష్టంలేదు, కానీ మా అత్తగారు మాత్రం ఎప్పుడూ కొడుకు వెనుకే ఉన్నారు.”

“ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక సంవత్సరం పాటు నాకు తెలుగు రాదు. ఆ అవసరం కూడా కలగలేదు. కానీ వారు వినలేదు, బలవంతంగా నేర్పించారు. కొద్ది రోజులు ఆయనే చెప్పారు, ఆ తర్వాత టీచర్ ఒకతను వచ్చి నేర్పించారు. ఇప్పుడు నాకు తెలుగు చక్కగా వచ్చు. రామాయణ, భారత, భాగవతాలు మొత్తం తెలుగులో కూడా చదివాను. తెలుగు నేర్చుకోకపోతే ఎంత కోల్పోయేదాన్నో అని చాలాసార్లు అనుకున్నాను.”

“ఇది ఎప్పుడో జరిగిన సంఘటన, అప్పటికి మేమింకా ఇక్కడికి రాలేదు. మావారు వ్యాపార నిమిత్తం వస్తూ ఉండేవారు. ఇక్కడి రాజు ఒకరు మా డీలరుషిప్పులోని కారు కొని రోడ్లు ఊడవటానికి వాడారంట. మా మామగారికి అది గొప్ప తలనొప్పి తెచ్చిపెట్టింది. చాలా రోజులు వారిద్దరూ మాట్లాడుకోలేదు.”

“ఇప్పుడందరూ మెచ్చుకుంటున్నారు చూడండి. ఆ ప్యాక్టరీ కట్టేప్పుడు చేతిలో డబ్బులు ఆడలేదు. నా బంగారం మొత్తం వారే తీసుకున్నారు. అప్పుడు మాత్రం చాలా దుఃఖించాను. మరళా సంవత్సరం తిరిగేసరికి ఇచ్చారనుకోండి. నిజం చెప్పొద్దూ ఆ సంవత్సరం మాత్రం ఏమిటో ఈ మనిషి అనుకున్నాను. మా ఇద్దరి మధ్యా ఎక్కువగా మౌనమే రాజ్యమేలింది.”

* * *

డ్రయివర్:

“అయ్యగారు ఇక్కడికి రాకముందునుండీ, అంటే వారి నాన్నగారూ అతను కలిసి వస్తున్నప్పటినుండీ నాకు తెలుసు. వారే నాకు డ్రయివింగ్ నేర్పించి ఈ ఉద్యోగం ఏర్పాటు చేశారు. అంతకు ముందు నా జీవితం గుఱించి మాట్లాడుకోవడం నాకు ఇష్టం ఉండదు. తింటానికి కూడా ఏమీ దాచుకోలేని రోజులు అవి. అయ్యగారు నన్ను బాగా చూసుకున్నారు. మా పిల్లలిద్దరినీ బాగా చదివించారు. ఇప్పుడు వాళ్లు దేశం బయట రాజుల్లా ఉంటున్నారంటే అంతా ఆయన చలువే. ”

“కొడుకు గుఱించి మాత్రం అయ్యగారు చాలా బాధపడేవాళ్ళు. చివరాకరికి బాబుగారు దార్లోకి వచ్చారనుకోండి. ఆ కమ్యునిష్టుల్లో చేరి తిరుగుతున్నన్ని రోజులూ అయ్యగారికి నిద్రలేదు, ఆకలి లేదు. కొడుకు తిరిగి వచ్చినప్పుడు మాత్రం చాలా సంతోషించారు. అదరికీ పార్టీ ఇచ్చారు. ‘రాక ఎక్కడికి పోతాడు, వాడు నా కొడుకు’ అంటూ మీసాలు మెలేశారు. అయ్యగారికి ఆ మీసాలంటే మాత్రం బహు ప్రీతి. కొడుకుని మీసాలు పెంచమని చాలాసార్లు అడిగారు, బాబుగారు విన్లేదనుకోండి. ”

“నేను లేకుండా అయ్యగారు ఎటూ వెళ్ళేవాళ్ళు కాదు. నేను రిటైర్ అయ్యేంతవరకూ అలానే జరిగింది. ఒకసారి మాత్రం అయ్యగారు ఒంటిగా డ్రయివింగ్ చేసుకుంటూ బయలుదేరారు, అన్నలు పట్టుకుపొయ్యారు. ఆ తరువాత ఎప్పుడూ నేను లేకుండా బయటకు వెళ్ళలేదు, అదొక సెంటిమెంటు అయ్యగారికి..”

* * *

జగదీశ్వర్ బహద్దూర్:

“నిజానికి మా జీవితమంతా సుండర్ గారి బిక్షే. ఇప్పుడు నేను యంపీగా ఉన్నా, మా సోదరి గొప్ప డాక్టరు అయినా అంతా వారి చలువే. ఆ రోజు మా గడీ కాలబెట్టిన రోజు వారే స్వయంగా మమ్ము తప్పించి, హైదరాబాదు చేర్పించారు. వారు ఆ రోజు రాకపోతే మా బతుకులు ఏమైపొయ్యేవో.”

* * *

నాయుడు:

“సుండర్ నాకు అర్థం కాలేదు. ఆ విషయం ఒప్పుకొని తీరాలి. అతను మంచివాడో, చెడ్డవాడో నేను చెప్పలేను. అతన్ని మొదటి సారి మేము కిడ్నాప్ చేసినప్పుడు చాలా ధైర్యంగా ఉన్నాడు. ప్రాణం అంటే ఆశలేని వాడిలా ప్రవర్తించాడు. చాలా పెద్ద మొత్తం డబ్బు ముట్టచెప్పి విడిపించుకున్నారనుకోండి. ఆ తర్వాతే మేము గడీపై దాడి చేశాము. కానీ బహద్దూర్ కుటుంబం మొత్తాన్నీ కాపాడాడు. బహుశా మా పథకాలు ముందే పసిగట్టి ఉంటాడు. మా హిట్ లిస్టులో ఎప్పుడూ అతని పేరు ఉంది. రెండుసార్లు తప్పించుకున్నాడు, ఒకసారి అదృష్టవశాత్తూ, ఒకసారి మా పొరపాటు వల్లా. అతని కొడుకు మాతో పార్టీలోకి వచ్చినప్పుడు వద్దనలేదు, పొమ్మనలేదు. లాయరుని పిలిచి ఆస్తిపంపకాలు చేసుకొని తెగతెంపులు చేసుకున్నాడు. తర్వాత ఆ కొడుకు తండ్రి దగ్గరకి తిరిగి చేరినప్పుడూ అంతే మౌనంగా ఉన్నాడు. ఆస్తుల లెక్కలూ అడగలేదు. అప్పుడప్పుడూ అనుకుంటూ వుంటాను, సుండర్ మాకున్న మంచి శతృవు.”

* * *

జూనియర్ సుండర్:

“నాన్నగారు చాలా గొప్ప వ్యక్తి. ఆ విషయం నాకు అర్థం కావడానికి చాలా కాలం పట్టింది. ఆయనకి డబ్బులు బీరువాల్లో దాచుకోవడం ఇష్టం ఉండదు. రాజుల సొమ్ము రాళ్ళ పాలు అనేవారు. సహాయం కోసం ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. ఎవరికీ లేదనే వారు కాదు. ఉద్యోగం కోసం వచ్చిన వారికి ఎప్పుడూ నిరాశ ఎదురయ్యేది కాదు. తన దగ్గర లేకపోతే స్నేహితుల వద్దయినా చూపించేవారు. వారు నాకు పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఆ కుటుంబం బాగోగులు నాకు తలకు మించిన పనే, కాకుంటే నాన్నగారి పెపంకం, వారి ముందుచూపు నాకు మార్గదర్శి. ”

(ఇది చెపుతున్నప్పుడు జూనియర్ కళ్ళల్లో నీరు తిరిగాయి)

* * *

ఇక్కడివరకూ ఎవరైనా చదివి వుంటే ఇంకా వ్రాయలేనందుకు క్షమించాలి. నేను ఎలాగూ దీన్ని నేను ప్రచురించబోవడం లేదు కనుక ఇది చదివే వాళ్ళు స్నేహితులో, బంధువులో, వంశాంకురాలో అయి వుంటారు. నా జీవితం ఇప్పుడే ఒక దారికి వచ్చింది. ఇంట్లో వాళ్ళు పట్టుబట్టి పెళ్ళి చేశారు. సుండర్ గారి ప్రాజెక్టు తరువాత మరింత పెద్ద ఉద్యోగం మరింత పెద్ద జీతంతో వచ్చింది, కానీ పని మరీ ఎక్కువ. అసలు తీరిక ఉండటం లేదు. సీనియర్ సుండర్ గారి గురించి ఇహ వ్రాసినా చదివే వాళ్ళు లేరు కనుక ఇహపై ఏమీ వ్రాయడం లేదు. అన్నట్టూ నాకు ఈ వారం పెదానమంత్రిగారితో ఇంటర్వ్యూ వుంది. దాని గురించి వ్రాస్తానులేండి ఈ డైరీలో.

3 thoughts on “సీనియర్ సుండర్

  1. కథ బాగానే చదివించింది కానీ కథలో నేను ఎదురు చూసిందేదో నాకు దొరకలేదు. దేనికోసం చూశానో కూడా తెలియట్లేదు.

  2. గతంతో ముడిపడినదీ, అర్ధమయ్యీ అవ్వనిది, కాసిని కష్టాలూ, కొన్ని బాధలు ఉద్వేగాలూ వున్నదీ ఏదైనా బాగుంటుంది ఇదీ అంతే

  3. talaa tokaa leyni katha..kaani chivari varakoo chadivinchindi….mari chivaa yedo okati undaka potundaa ano ley ka kathaa sravantho…?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.