గిల్గమేశుడు

గిల్గమేశుడు ఉరుక్కు నగర వీరాధివీరుడు, కత్తిని నమ్మినవాడు, భుజబలంలో సాటి లేనివాడు, బుద్ది బలంలో మేటి వాడు, ఉరుక్కు నగర నిర్మాత, రెండు వంతులు మానవాంశ, ఒక వంతు దైవాంశ కలవాడు, స్వర్గ ద్వారాలు చూసి వచ్చినవాడు, తిరుగులేని వాడు, మడమ తిప్పని వాడు, బహు సుందరాంగుడు, అతి విశాల దేహం కలవాడు, ముందు చూపున్నవాడు, మేరు గంభీరుడు, పదులా — ఇరవైలా ? ఇలా పలు సుగుణాలు రాశిగా కలవాడు గిల్గమేశుడు.

సుమేరియన్ దేశపు రాజు, నేటికి సుమారుగా ఐదువేల సంవత్సరాల ముందటి వాడు, తన చరితను రాజ్యమంతా రాతి ఫలకాలపై వ్రాయించిన వాడు. ఇప్పటి వరకు మనకి లభించిన లిఖిత కథలలో ఇదియే పురాతనమైనట్టిది. ఈ కథల నుండి తరువాతి నాగరికతల గాథలు చాలా ప్రభావితమైనాయి. అట్టి ఉన్నత లక్షణములతో కూడిన గిల్గమేశుని కథ
తెలుసుకుందాం.

 

జననం

క్లుప్తంగా చెప్పాలంటే గిల్గమేశుని, దేవాదిదేవుడయిన అను ఆజ్ఞపై, సృష్టికి అధిదేవత అయిన అరురు దేవత — రెండు వంతులు దైవాంశతోను, ఒక వంతు మానవాంశతోనూ సృష్టించింది. సూర్య భగవానుడు ఆ దేహానికి అందాన్నిస్తే, తుఫానుల అధిదేవత అయిన అదదుడు ధైర్యాన్నిచ్చాడు.

ఉరుక్కు నిర్మాణం, పాలన, విజయం

గిల్గమేశుని కాలానికి ఉరుక్కు నగరం అంతకు క్రితం వచ్చిన మహా జల ప్రళయంలో పూర్తిగా నాశనం అయింది. గిల్గమేశుని ముందు వచ్చిన రాజులు నగరానికి పూర్వ వైభవం తీసుకొని రావటంలో పూర్తిగా విఫలం అయ్యారు. అటువంటి పరిస్థితుల్లో మహా వీరుడైన గిల్గమేశుడు తన సోదరులతో కూడి, గొప్ప సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని రాజ్యాన్ని ఏక తాటిపై నడిపించాడు. చెట్టుకొరకు, పుట్టకొకరు అయిన రాజ్య ప్రజలను ఒక్క చోటుకు చేర్చాడు. శతృవులను క్రూరంగా అణిచివేశాడు. మృగాలను
తరిమేశాడు. అడవులను వాస యోగ్యం చేశాడు. అన్నింటికంటే ముఖ్యమైనది ఉరుక్కు నగరాన్ని మహా నగరంగా తీర్చిదిద్దాడు. దుర్భేద్యమైన కుడ్యాలు నిర్మించాడు. ఆ నగరానికి ఏడు గడియలతో సింహ ద్వారాన్ని ఏర్పాటు చేశాడు. సప్తర్షులు వేసిన పునాదులపై కొత్త నగరాన్ని విజయవంతంగా పూర్తిచేసి, జనులందరూ ఆనందాశ్చర్యాలకు
లోనగునట్లు నగరాన్ని తీర్చిదిద్దాడు.

నగరాన్ని మూడు భాగాలుగా విభజించాడు. ఓ భాగంలో మనోహర భవనాలు, రెండవ భాగంలో నయనారవింద తోటలు, మూడవ భాగం మట్టి దిబ్బలుగా వదిలేశాడు.

ప్రజలంతా ఈతి బాధలు లేకుండా ఎవరి లక్ష్యాలవైపు వారు జీవన యానం సారించారు. క్రూర మృగాల బాధ లేదు, దుష్ట మాంత్రికుల బాధ లేదు, దేవతలు కూడా ఆనందించి అందరికీ అన్నీ అందించసాగారు.

ఎల్లప్పుడూ పరిస్థితులు ఒకే లాగా ఉండవు కదా, గిల్గమేశుడు ఎదురులేని వాడైనాడు. నగర ప్రజలు అతని గురించి బయట ఏమీ చెప్పే ధైర్యం లేనివారైనప్పటికీ ఇంటి లోపల మాత్రం “గిల్గమేశుడు చేతికందివచ్చిన ఏ కొడుకునీ తండ్రికి వదలడు,
ఏ సుందరాంగినీ పెండ్లి కూమారునికి వదలడు” అని చెప్పుకోసాగారు.

ఇవన్నీ విన్న దేవాధిదేవుడు ‘అను’, సృష్టికి అధిదేవత అయిన అరురుని పిలిచి, గిల్గమేశునికి పోటీగా, వానికి సమ ఉజ్జీగా మరొకరిని సృష్టించమని ఆజ్ఞాపిస్తాడు, తద్వారా వారిద్దరూ కలిసి పోరాటాలు చేసి ఉరుక్కు నగర ప్రజలు
గుండెలమీద చెయ్యి వేసుకొని హాయిగా ఉండగలుగుతారు అని చెప్తాడు.

ఈ ఆజ్ఞలు గైకొని అరురు దేవత, ‘అను’ ప్రతిబింబాన్ని తన హృదయంలో ఉంచుకొని చేతులు కడుక్కొని, మట్టి ముద్ద తీసుకొని, వీరుడైన ‘ఎంకిడు’ని సృష్టించింది. అతను యుద్దానికి అధిదేవత అయిన నినుర్తా వలె యుద్ద వీరుడు, అతని శరీరం వెంట్రుకలతో నిండి ఉంది. తల అయితే అమ్మాయి జుట్టులా ఉంది.

ఈ ఎంకిడుకి కొంపా గోడు ఏమీ లేవు. అడవిలో పడి ఒక జంతువులా తిరిగేవాడు. పులులపై స్వారీ చేసేవాడు. సింహాలతో ఆడుకునేవాడు. జంతులతో గెంతు లేసేవాడు.

ఓ రోజు ఏమయిందంటే, ఓ వేటగాడు ఇదే అడవికి వేటకు వచ్చి జలపాతం దగ్గర మాటు వేశాడు. కానీ ఎండికు తన సింహాలతో వచ్చి వాణ్ణి తరిమేశాడు. రోజూ ఇలాగే జరగసాగింది. ఇహ లాభం లేదని ఆ వేటగాడు తన తండ్రయిన కోయ దొరకు చెప్పాడు.
“నాన్నా, అడవిలో ఓ అడవి మనిషి మా వేట సాగనివ్వటంలేదు. మేము వేసిన ఉచ్చులు తెంపేస్తున్నాడు. చిక్కిన జంతువులను వలల్లో నుండి బయటకు పంపిస్తున్నాడు. సింహాలతో వచ్చి మమ్మల్ని తరిమేస్తున్నాడు. ఇలా అయితే మనం ఉండలేము.”

కోయ దొర బాగా ఆలోచించి తన కొడుక్కి,  “నాయినా, నువ్వు ఇప్పుడే ఉరుక్కు నగరానికి వెళ్లి, రాజయిన గిల్గమేషున్ని కలుసుకో, కలుసుకొని మన పరిస్థితి వివరించు. అందమైన ఇస్తార్ దేవాలయపు నాట్యగత్తెను పంపి ఈ అడవి
మనిషిని అదుపులో ఉంచమను.” అని సలహా ఇచ్చి ఉరుక్కు నగరం పంపుతాడు. రాజు అలాగే ఓ తెలివైన అందమైన నాట్యగత్తెను పంపుతాడు. ఆమే ఎంకిడుని జలపాతం వద్ద కలుసుకుంటుంది. వారిద్దరి చూపులు కలుసుకుంటాయి. మొదట కుతూహలం, తరువాత ఆసక్తి, తరువాత అనురక్తి. ఆరు పగళ్లు, ఏడు రాత్రులూ క్షణాల్లా గడిచిపోతాయి.

తరువాత ఎంకిడు తన జంతువుల వైపు చూస్తాడు. అవి భయంతో దూరంగా పారిపోతాయి. వాటి వెనకాలే పరుగెత్తి పట్టుకోవాలని చూస్తాడు, కానీ కాళ్లు బలహీనం అవ్వటం వల్ల వీలు కాదు. అప్పుడు నాట్యగత్తె ప్రేమతో, అనునయంగా ఇలా చెపుతుంది. “ప్రియమైన ఎంకిడూ, నువ్వు అమోఘమైన బలసంపన్నుడవు. నీ ధైర్య సాహసాలు, తెగింపు అసమానమైనవి. ఉరుక్కు అనేది ఓ మహా నగరం. నీకు అదే తగిన స్థలం”

ఎంకిడు సంతోషంతో ఒప్పుకుంటాడు. ‘నేను అందరికంటే బలవంతుడనని ఉరుక్కు నగరం మొత్తం చాటుతాను’ అని పలుకుతాడు. వెంటనే నాట్యగత్తె గిల్గమేశుని గురించి చెప్పి అతను అమిత బలవంతుడని, అతనితో మంచిగా ఉండమని సలహా ఇస్తుంది.

ఇంకా ఆమే తన దుస్తులు సగం సగం చేసి ఒకటి ఎంకిడుకు ఇచ్చి మరొకటి తను ధరిస్తుంది. ఆ తర్వాత కోయ దొర ఇంటికి తీసుకొచ్చి, చక్కగా అలంకరించి, అందగా తయారుచేసి భోజనం చెయ్యడం వంటి నాగరిక లక్షణాలు నేర్పించి ఉరుక్కునకు
ప్రయాణం కడుతుంది.

ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటే, అక్కడ ఉరుక్కు నగరంలో గిల్గమేశునికి రెండు కలలు వస్తాయి.

మొదటి కలలో ఓ గొడ్డలి గిల్గమేశునిపై పడుతుంది. గిల్గమేశుడు దాన్ని పైకి లేపలేడు, కదల్చలేడు. ప్రజలు దాని చుట్టూ మూగుతారు. గిల్గమేశుడు దానిని తన భార్యలాగా వాటేసుకొంటాడు.

రెండవ కలలో ఓ నక్షత్రం ఉరుక్కు నగర సభా స్థలం పై పడటం గిల్గమేశుడు చూస్తాడు. దానిని కూడా గిల్గమేశుడు భార్యలాగా కౌగిలించుకుంటాడు.

ఈ కలల అర్థాలు తెలుసుకోటానికి గిల్గమేశుడు అతని మాతృ శ్రీ దగ్గరకు వెళ్తాడు. తెలివైన నిన్సన్ దేవత కలల అర్థాలు ఇలా చెప్తుంది. ‘ఆ నక్షత్రం, గొడ్డలి త్వరలో రాబోతున్న నీ జతగాడు. అతను అమిత బలవంతుడు మరియు నీకు మంచి
మిత్రుడు అవుతాడు. అతను నిన్ను కష్టాలనుండి రక్షిస్తాడు, కానీ మధ్యలోనే విరమిస్తాడు. ’

ఎంకిడు తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. దారిలో మరో బాటసారి కలిసి మాటలు కలుపుతాడు. అతను ఉరుక్కు రాజ్యాధినేత గిల్గమేశుని శౌర్య ప్రతాపాలు వేనోళ్ల పొగిడి, తరువాత అతను రాజ్య ప్రజలు ఇళ్లో అనుకునే మాటలు చెపుతాడు.
‘గిల్గమేశుడు యవ్వనంలోని ఏ యువకుణ్నీ తన తల్లిదండ్రులకు వదలడు, యవ్వనంలోని ఏ యువతినీ తన భర్తకు వదలడు’ ఆ మాట విని ఎంకిడు కోపంతో పళ్ళు పట పట కొరుకుతాడు.

ఎంకిడు నగర ప్రవేశం చేస్తాడు. అతణ్ని చూసి నగర వాసులు ఆశ్చర్యపోతారు. “అరె ఇతను అచ్చు మన గిల్గమేశ మహారాజులానే ఉన్నాడే, కాకుంటే కొంచెం ఎత్తు తక్కువ. కొద్దిగా బలంగా ఉన్నాడు. మొత్తానికి మన రాజుకి సరి
అయిన జోడీ” అని అనుకుంటారు.

అదే రోజు రాత్రి ఓ వివాహం. పెళ్లి కూతురు శోభనం గదిలోకి పంపబడ్డది. గిల్గమేశుడు తన భవనం నుండి బయల్దేరాడు. కానీ మొదటిసారిగా గిల్గమేశుని ఒకరు అడ్డుకున్నారు. దారికి అడ్డంగా ఎంకిడు!!

గిల్గమేశుని కళ్లు చింత నిప్పుల్లా అయ్యాయి. రౌద్రంతో ఊగిపోతాడు. ఒక్క వేటుతో ఎంకిడుని దారినుండి అడ్డు తొలగించి వేద్దామని చూస్తాడు. పోరాటం మొదలయింది. ఇద్దరూ చేతులు పట్టుకోని ఒకరినొకరు బలంగా వెనక్కి నెడుతూ ప్రత్యర్థిని పడెయ్యాలని చూశారు. నగర వాసులు భయంతోనూ, ఆశ్యర్యంతోనూ నలు మూలలకు పరుగులు తీశారు. దేవతలు కూడా ఆ అపూర్వ పోరాటం చూడసాగారు.

ఇళ్ల తలుపులు పీకి ఒకరి పై ఒకరు విసురుకున్నారు. గోడలు అదిరాయి. చూసేవారికి రెండు ఎద్దులు పోరాటంలాగా కన్పించింది. ఓ సమయంలో ఎంకిడు కొద్దిగా పై చేయి సాధించాడు. అప్పుడు ఎంకిడు తన మోకాలును నేలకు ఆనించి తల
ఎత్తి గిల్గమేశునివైపు చూసి “గిల్గమేశా ప్రపంచంలోనే నా అంతటి వాడు మరొకరు లేరు. నిన్ను మనుష్యులందరిలోకీ ఉన్నతునిగా దేవాధిదేవుడు సృజించాడు. అందుకనే నువ్వు రాజువయ్యావు. ఆ అనిల దేవుని ఆశీస్సులు పుష్కలంగా నీకున్నాయి. ”

ఈ మాటలు విన్న తరువాత గిల్గమేశునికి తన తల్లి మాటలు గుర్తు వచ్చాయి. అప్పటి నుండి వారిరువురు మంచి స్నేహితులయ్యారు. అంతే కాకుండా గిల్గమేశుని మాతృ శ్రీ ఎంకిడుని దత్తు తీసుకుంది. దానితో వారిరువురు
అన్నదమ్ములు కూడా అయ్యారు.

కాలం ఇలా గడచిపోతుంటే, ఓ రోజు ఎంకిడు గిల్గమేశుని దగ్గరకు వచ్చి “సోదరా! ఈ రాజ భోగాల మద్య నాకు ఏమీ తోచటం లేదు. బద్దకం పెరిగిపోతుంది.
యుద్దాలు లేక, ఎటువంటి ఆసక్తికరమైన పనులులేక కర చరణాలు బలహీనమవుతున్నాయి. యుద్ద కేకలు వేయక నా గొంతు ఉపయోగంలో లేకుండా పోతుంది. నా బలాలన్నీ బలహీనతలవుతున్నాయి. “అంటూ వాపోతాడు.

ఈ మాటలు వినంగనే ఉత్సాహవంతుడయిన గిల్గమేశుడు “అయితే దేవదారు వనానికి వెళ్లి, అక్కడి దేవ రాక్షసుడైన హుంబాబాని వధించి ఆ వనాన్ని మనం స్వాధీనం చేసుకుందాం” అంటాడు.

అంతే ఒక్కసారిగా ఎంకిడు ఉలిక్కిపడతాడు. అతని వెన్ను జలదరిస్తుంది. తరువాత కూడబలుక్కోని “సోదరా! సోయిలో ఉండే మాట్లాడుతున్నావా? హుంబాబాతో యుద్దమంటే పిల్లాటలా? దేవదారు వన ప్రవేశమే అసాధ్యమైంది. ఆ వనంలోకి
ప్రవేశించినా ఏడు రక్షక కవచాలతో ఉన్న హుంబాబాని ఎదుర్కోవటం పులి నోట్లో తల పెట్టడం ‍వంటిది. పోయి పోయి మిడతల వలే అగ్నిలో దూకుతామా? పిచ్చిగా ప్రవర్తిస్తామా? హుంబాబా అతి భయంకరమైన వాడు. అతని నోరు అగ్ని, అతని శ్వాస
స్వయంగా మృత్యు దేవత. అటువంటి హుంబాబాతో తలపడటమా? ఇహంలో ఉండే మాట్లాడుతున్నావా? ” అంటూ తన భయాల్ని నిస్సంకోచంగా బయట పెట్టి గిల్గమేశుని ప్రమాదకరమైన యుద్ద ప్రయత్నాన్నుండి మరల్చాలని చూస్తాడు.

కానీ గిల్గమేశుడు ఏ మాత్రం భయపడకుండా “సోదరా! ఎంకిడూ!! నువ్వేనా ఇలా మాట్లాడేది? ఈ దేహం అశాశ్వతమైనది. దేవతల్లా మనం నిరంతరమూ జీవంచబోవడంలేదు. అంత అదృష్టం మనకు లేదు. మనం దురదృష్టవంతులం. మన రోజులు లెక్కించదగ్గవి. అట్టి అశాశ్వతమైన జీవితం కోసం శాశ్వతమైన కీర్తిని వదులుకుంటావా? కేవలం మన
వీర కార్యాలు మాత్రమే మన్నీ భూమిపై శాశ్వతంగా జీవింప చేస్తాయి. హుంబాబా వంటి బలవంతులతో తలపడినప్పుడే కదా మనకు గుర్తింపు వచ్చేది. “అంటూ ఎంకిడు భయాలు పారద్రోలి, ధైర్యం చెప్పి, కర్తవ్యం వైపు నడిపిస్తాడు. చివరకు ఎంకిడు
అయిష్టంగానే అయినా ఒప్పుకుంటాడు. కానీ ఎంకిడు లాగానే అతని రాజ సభ మొత్తం ముక్త కంఠంతో వద్దు వద్దు అని

గిల్గమేశుని ప్రయత్నాన్ని ఆపాలని ప్రయత్నిస్తుంది. “రాజా! గిల్గమేశా మీరింకా యవ్వనవంతులే, అనుభవించవలసిన జీవితం చాలా ఉంది. రాజ్యాన్ని రక్షించవలసింది మీరే, అటువంటి మీరే ఇటువంటి ఆత్మహత్యా సదృశమైన దుస్సాహసానికి పూనుకుంటారా? మా పరిస్థితి ఏం కావాలి? భర్తలేని భార్యలాగా ఈ రాజ్యాన్ని అనాథను చేసి వెళ్తారా? హుంబాబా మామూలు మనిషి లాంటి వాడు కాదు. అతన్ని ఏ ఆయుధమూ ఏమీ చెయ్యలేదు. అతనితో తలపడటం ఏ దృష్టితో చూసినా తెలివైన
పని కాదు” అంటూ రకరకాలుగా గిల్గమేశుని ప్రయత్నాన్ని వారించ యత్నించారు. కానీ గిల్గమేశుడు ముందుకే కాని వెనక్కి వెళ్లే వాడు కాదాయె. అన్నింటినీ విని కూడా ముందుకు వెళ్లడానికే నిర్ణయించుకున్నాడు.

ఈ విషయాన్ని విన్న గిల్గమేశుని మాతృ శ్రీ నిన్సన్, సూర్యభగవానున్ని ప్రార్థిస్తుంది. “ఓ సూర్య భగవాన్! ఎందుకు గిల్గమేశునికి ఇంతటి చపల చిత్తాన్నిచ్చావ్? అతను తెలియని రహదారిలో ప్రయాణం చెయ్యాలన్న కుతూహలం
ఎందుకు కలిగించావు? కనీ వినీ ఎరుగని యుద్ద తంత్ర నిపుణుడైన హుంబాబాతో తలపడాలనే తలంపు ఎందుకిచ్చావు, ఏం జరిగినా నీదే బాధ్యత. పగలూ రాత్రీ అతన్ని కాపాడవలసిన వాడవు నువ్వే” అంటూ పరి పరి విధముల సూర్యుణ్ని ప్రార్థిస్తుంది.

మాతృ శ్రీ ఆశీర్వచనాలు అందుకొని గిల్గమేశుడు మరియు ఎంకిడులు మరో ఏడుగురు మహా వీరులతోనూ, యాభై మంది అవివాహిత యువ వీర సైన్యంతోనూ హుంబాబాతో తలపడటానికి బయల్దేరుతారు. అందరికంటే ముందు ఎంకిడు నిలిచి దారి చూపుతాడు. ఎంకిడుకి ఈ అరణ్య మార్గం కొట్టిన పిండి కదా! అదియును కాక తను ఇంతకు ముందు
హుంబాబాను ముఖాముఖి చూసి ఉంటాడు. ఇంకా అరణ్య యుద్దాల్లో ఆరితేరినవాడు. ఇరవై యోజనాలు ప్రయాణం చేశాక ఆహారం కోసం విశ్రమించారు. ఆ తర్వాత మరో ముప్పై యోజనాలు ప్రయాణించి గొళ్లెన లెత్తారు. ఎంత వేగంగా ప్రయాణించారంటే ప్రతి మూడు రోజులకీ, సాధారణ జనులు 45రోజూల్లో ప్రయాణించేంత దూరం

ప్రయాణించారు. ఆరు పర్వతాలు ఆరు రోజుల్లో దాటారు. ఈ ఆరు రోజుల ప్రయాణంలోనూ, ప్రతి రోజూ సూర్యాస్తమయానికి ముందే ఒక పెద్ద నుయ్యి తవ్వే వాళ్లు. ఆ తర్వాత గిల్గమేశుడు శకునం చూసేవాడు. ఒక్కొక్క రాత్రి గిల్గమేశునికో కల
వచ్చింది. మొదటి రాత్రి గిల్గమేశుని మీద ఒక పర్వతం పడ్డట్టు కల వచ్చింది.  ఆ కల విని ఎంకిడు ‘భయము వలదు. గిల్గమేశా, ఆ పర్వతమే హుంబాబా. మనం తప్పకుండా హుంబాబాతో తలపడతాం మరియు పట్టి వధిస్తాం. ‘అంటూ
అర్థం చెపుతాడు.

రెండవ రాత్రి గిల్గమేశుని కలలో అదే పర్వతం వస్తుంది. కానీ ఈ సారి ఆ పర్వతం గిల్గమేశుని పాదాలపై పడి అతన్ని ఎటూ  కదలనివ్వదు. అప్పుడొక అందమైన కాంతి ఎంత అందమంటే ఇప్పటివరకు ఈ ప్రపంచంలో అంత అందాన్ని గిల్గమేశుడు
కనలేదు. అటువంటి అందమైన కాంతి దర్శనమిచ్చి గిల్గమేశుని పర్వతం నుండి బయటకు లాగుతుంది. త్రాగటానికి నీరు కూడా ఇస్తుంది. గిల్గమేశునికి ధైర్యం చెపుతుంది. అతని పాదాలు నేలకానిస్తుంది. మూడవ రోజు, నాల్గవ రోజు రాత్రి
కూడా ఇటువంటి కలే వస్తుంది. ఐదవ రోజు ఒక ఎద్దుతో యుద్దం చేసినట్టు కల వస్తుంది. ఈ కలలన్నింటికీ ఎంకిడు తగు అర్థాలు వివరించి గిల్గమేశుని ముందుకు నడిపిస్తాడు.

ఏడవ రోజుకి మరో పర్వత పాదం దగ్గరకు వచ్చారు. అదే దేవదారు వనానికి ద్వారం. అప్పుడు సూర్య భగవానుడు దర్శనమిచ్చి ‘వీరులారా హుంబాబా తన ఏడు రక్షణ కవచాల్లో ఆరు తొలగించాడు. త్వర పడండి. తక్షణమే యుద్దానికి వెళ్లండి’
అని సందేశమిచ్చాడు.

అడవిలో హుంబాబా యొక్క ఘర్జన వినంగనే ఎంకిడు యొక్క ధైర్యం సన్నగిల్లింది.

గిల్గమేశుడు మళ్లా ఎంకిడుకి ధైర్యం నూరిపోశాడు. “ఎంకిడూ! సోదరా!! ఎందుకిలా అధైర్య పడతావు? మనం ఆరు పర్వతాలు దాటి రాలేదు? యుద్దంలో మనం ఆరితేరిన వారం కాదు. నా చెయ్యి పట్టుకో, నా హృదయాన్ని తాకు. నీకు మృత్యువు గురించిన భయం ఉండదు. మనమిద్దరం కలిసి యుద్దానికెళ్తే తిరుగు ఉండదు. పద ముందుకు వెళ్దాం. నాకు నువ్వు రక్ష, నీకు నేను రక్ష.” అంటూ ఎన్నో విధాల ధైర్యం చెప్పాడు.

హుంబాబా నడక వల్ల ఏర్పడిన మార్గంలో వారు ముందుకు వెళ్లారు. వారికెదురుగా మహా దేవదారు వృక్షం కన్పించింది. అక్కడికి దగ్గరలోనే హుంబాబా నివాసం. హుంబాబాను బయటకు పిలవటానికి, అతనికి కోపం తెప్పించటానికి, ఇద్దరూ
కలిసి దేవదారు వృక్షాలు నాశనం చెయ్యటం మొదలు పెట్టారు.

హుంబాబా తీవ్రమైన కోపంలో వీళ్లపైకి వచ్చాడు. భయంకరమైన యుద్దం మొదలయింది. సూర్యభగవానుని ఆశీర్వాద, సహాయాలతో హుంబాబా ఓడించబడ్డాడు.  అలా బంధించ బడ్డ హుంబాబా గిల్గమేశుని శరణు శరణు అంటూ దీనంగా ప్రార్థించాడు. అతను కన్నీటి పర్వంతమయి గిల్గమేశుని వేడుకున్నాడు. జీవితాంతం వరకు బానిసగా ఉంటానన్నాడు. గిల్గమేశుని రాజ భవనాలకు కలప సరఫరా చేస్తానన్నాడు. గిల్గమేశుడు మెత్త బడ్డాడు. ఏం జరిగేదో కానీ ఇంతలో ఎంకిడు
కల్పించుకున్నాడు. ఎంకిడుకి హుంబాబా కుటిల బుద్ది బాగా పరిచయం. “గిల్గమేశా! వెంటనే వధించు. ఆలస్యం చెయ్యవద్దు. ఈ హుంబాబా చాలా కుటులుడు. మాటకు కట్టుబడి ఉండే వాడు కాదు. ఒక్కసారి వదిలావంటే ఇహ అంతే. శతృవుకు చేతులారా ప్రాణం పోసినట్టే. నీకు కళ్లు కనపడకుండా చేస్తాడు. వెళ్లే మార్గానికి అవరోధాలు కల్గిస్తాడు. ” అంటూ రకరకాల దృష్టాంతాలు చెపుతాడు.

ఈ మాటలన్నీ విన్న హుంబాబా పళ్లు పట పట కొరుకుతూ ఎంకిడుని శపిస్తాడు. “మీ ఇద్దరిలో నువ్వు ఎక్కువ కాలం బ్రతకవు” అంటూ శపిస్తాడు. ఇహ ఆలస్యం చెయ్యకుండా గిల్గమేశుడు తన పదునైన గొడ్డలితో హుంబాబా తలను మొండెం నుండి వేరు చేస్తాడు.

విజయోత్సాహంతో ఉరుక్కు నగరానికి తిరిగి వస్తారు. గిల్గమేశుడు హుంబాబాతో వీరంగా పోరాటం చేస్తున్నప్పుడు చూసిన ఇస్తార్ దేవత అతనితో ప్రేమలో పడింది. అదే విషయాన్ని ఆమె పలు ముద్దు ముద్దు మాటలతో, వయ్యారంగా చెప్తుంది. “గిల్గమేశా! నా ప్రియునివి కమ్ము. నీకు అంతులేని సంపదనిస్తాను. కీర్తినిస్తాను. ఇంకా అమోఘమైన శక్తినిస్తాను. కానీ నువ్వు మాకు మాత్రమే స్వంతం కావాలి.”

కానీ గిల్గమేశుడు అంత తేలిగ్గా లొంగే రకం కాదు కదా! “ఇస్తార్! నువ్వో
దేవతవి. నేనా ఒక రాజ్యాధినేతని మాత్రమే. మనిద్దరికీ పొత్తెలా
కుదురుతుంది?”అని ఇంకా “ఇస్తార్! నువ్వో కుంపటివి. బిగించని తలుపువి. గదిని
అది వేడిగానూ ఉంచదు, చల్లగానూ ఉంచదు. అమోఘమైన ఆయుధానివి, కాని
శతృశిబిరంలోని దానివి. యజమానిని కరిచే చెప్పులాంటి దానివి” వంటి పరుషమైన
పదాలతో ఇస్తార్ ని విమర్శిస్తాడు. ఇంకా తన పూర్వాశ్రమంలో ఎంత మంది
ప్రియుళ్లను ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసిందీ ఏకరువు పెడతాడు. తమోజ్
నుండి ఇషాల్ల వరకు ఎందరిని ఎన్ని రకాలుగా నాశనం చేసిందో చెపుతుంటే
కోపగ్రస్తురాలయిన ఆమె తన తండ్రి దగ్గరకు వెళ్లి “తండ్రీ! దేవాది దేవ అను,
గిల్గమేశుడు చూడండి ఎంత పొగరు పట్టాడో, నన్నే తీవ్రంగా అవమానించాడు. ” అని
పితూరీ చెప్తుంది. కానీ అను శాంతంగా “పుత్రికా! నీ అంతట నువ్వే
గిల్గమేశునితో కయ్యానికి కాలు దువ్వలేదూ! అయినా అతనేం తప్పు
మాట్లాడాడు?  అన్నీ ఉన్న మాటలే కదా అన్నాడు. “అంటూ సర్ది
చెప్పబొయ్యాడు. కానీ గిల్గమేశునిపై పీకల దాకా కోపంతో ఉన్న ఇస్తార్ దేవత
ముందు అను వచనాలన్నీ చెవిటిదానిముందు శంఖం ఊదినట్టే అయినాయి. స్వర్గలోకపు
ఎద్దుని ఇస్తే కానీ ఒప్పుకోనని పట్టు పట్టిన కుమార్తె ముందు తల వంచి అను
ఆమెకు ఆ స్వర్గలోకపు ఎద్దు ముక్కుతాడు కొన అందిస్తాడు. విజయగర్వంతో
గిల్గమేశుని అణగ దొక్కాలన్న కోపంతో ఆమె దాన్ని ఉరుక్కు నగరం పైకి
వదులుతుంది.

 

ఆ భయంకరమైన ఎద్దు ఉరుక్కు నగరం వచ్చి ఒక్కసారిగా బుస పెట్టింది. దెబ్బకు
నూర్గురు పౌరులు చచ్చారు. తరువాత మరోసారి భీకరంగా బుస పెట్టింది, ఈ సారి
రెండు వందల మంది మరణించారు. మూడోసారి బుస పెట్టినప్పుడు పెద్ద గొయ్యి
ఏర్పడింది. అప్పుడే అక్కడకు వచ్చిన ఎంకిడు దాని తోకను బలంగా పట్టుకోని
గిల్గమేశుని కేకేశాడు. “సోదరా! గిల్గమేశా మనమెన్నో పేరు ప్రతిష్టలు
సంపాదించాం. ఇప్పుడవన్నీ పోగొట్టుకుంటామా”  అంటూ పిలవగానే గిల్గమేశుడు
తన పదునైన ఖడ్గంతో ఒక్కేటున ఆ స్వర్గలోకపు ఎద్దు తలను మొండెం నుండి వేరు
చేశాడు. ఎంకిడు దాని గుండె చీల్చి సూర్య దేవునికి ఆరాధన చేశాడు. దాని
కొమ్ములను గిల్గమేశుడు విజయ చిహ్నంగా ఉంచుకున్నాడు. ఇస్తార్ కోపంతో ఏదో
అనబొయ్యేంతలో ఎంకిడు ఆ ఎద్దు తొడ కోసి ఆమె మొహం పైకి విసిరాడు. దానితో
పలాయనం చిత్తగించింది. సోదరులిద్దరూ యూప్రటీస్ నది ఒడ్డున కర చరణాలు శుభ్రం
చేసుకున్నారు. ఆ తరువాత విజయ వాయిద్యాలతో రాజ భవనం చేరుకున్నారు.

కొన్ని రోజుల తరువాత ఓ ఉదయం ఎంకిడు గిల్గమేశుని దగ్గరకు వచ్చి
“సోదరా! రాత్రి నాకో కల వచ్చింది. ఆ కలలో దేవ సభలో దేవతలందరూ మన గురించే
మాట్లాడుకుంటున్నారు. హుంబాబానూ, దేవ లోకపు ఎద్దును వధించినందుకు శిక్షగా
మనిద్దరిలో ఒకరికి మరణం తప్పదని అను దేవుడు అన్నాడు. అలా అయితే ఎంకిడునే
మరణించాలని అనిల దేవుడు అన్నాడు. సూర్య భగవానుడు ఈ అమానుషమైన శిక్షను
ఎదుర్కోవాలని చూశాడు, కానీ ఎవ్వరూ ఆయన మాట వినలేదు” అంటూ విషణ్ణ వదనంతో
చెపుతాడు. ఆ తరువాత కొన్ని రోజులకే ఎంకిడు జబ్బు పడతాడు.

అటువంటి స్థితిలో ఎంకిడును చూసిన గిల్గమేశునికి దుఖము ఆగలేదు. “ప్రియమైన
సోదరా! ఎంకిడూ!! ” అని కన్నీటి పర్యంతం అవుతూ “నిన్ను తీసుకెళ్లి దేవతలు
నన్ను విముక్తుణ్ణి చేస్తున్నారా! అయ్యో!! నా సోదరుణ్ణి నే మళ్లా చూడలేనా”
అంటూ నిరంతరం రోదించసాగాడు.

జబ్బు పడ్డం ఎంకిడు మొదట ఆవేశ పడ్డాడు. తరువాత తనను ఈ ఉరుక్కు నగరం
తీసుకొచ్చిన వేటగాన్నీ, నాట్యగత్తెను, అందరినీ వరుస పెట్టి తిట్ట సాగాడు.
“అయ్యో వారు నన్ను ఈ నగరం తీసుకొని రాకపోతే నాకీ అకాల మరణం ఉండేది కాదు
కదా. నేను ఏ యుద్దంలోనో వీర మరణం పొందకుండా ఇలా ముష్టి మరణం
పొందుతున్నానేమిటి” అంటూ పరి పరి విధముల రోదించసాగాడు.

ఇవన్నీ గమనించిన సూర్య భగవానుడు “ఎంకిడూ, శాంతం వహించు. నువ్వు ఉరుక్కు
నగరాన్ని ఆనందించలేదూ, దేవతలకు మాత్రమే లభించే భోజనం ప్రతి రోజూ
స్వీకరించలేదూ, రాజులు మాత్రమే త్రాగే పానీయాలు ప్రతి రోజూ సేవించలేదూ,
గిల్గమేశుని వంటి గొప్ప స్నేహితుని పొందలేదూ ” అంటూ ఎంకిడును శాంత పరిచాడు.

అలా 12 రోజులు ఎంకిడు అచేతనంగా పడు ఉన్నాడు. ఆ తర్వాత ఈ లోకాన్ని
వదిలి వెళ్లాడు. ఆ దృశ్యాన్ని చూసిన గిల్మమేశుడు కన్నీరు మున్నీరుగా
విలపించాడు. “నా చేతిలోని గొడ్డని నువ్వు, నా నడుముకు వేలాడు పటకా కత్తివి
నువ్వు, నా ముందుండు రక్షణ కవచం నువ్వు, నా సర్వస్వాన్ని దోచుకెళ్లారు.
జీవితమంతా చీకటి మయం అయింది. ఇంకెప్పుడూ నిన్ను చూడలేను. అయ్యో! ” అంటూ ఆర
పగళ్లు ఏడు రాత్రులు రోదించాడు. ఆ తరువాత ఎంకిడు నిలువెత్తు విగ్రహం నగరంలో
ప్రతిష్టించాడు. కానీ గిల్గమేశుడు ఎప్పటికీ మునుపటి గిల్గమేశుడు
కాలేకపొయ్యాడు. ఇంకా కొంత కాలానికి తను కూడా మరణించాల్సిందే కదా అనే దిగులు
పట్టుకుంది.

ఎంకిడు మరణం తరువాత విషాదంలో గిల్గమేశుడు జ్ఞానం కోసం అన్వేషణ
మొదలు పెట్టాడు. అరణ్యాలలో ప్రవేశించి దారి తప్పిన సింహంలా తిరుగాడాడు.
దాటలేని పర్వతాలెన్నో దాటాడు. సముద్రాలపై ప్రయాణించాడు. క్రూరమృగాలతో
పోరాటాలు చేశాడు. వాటి చర్మాలను దుస్తులుగా ధరించాడు. వాటి మాంసాన్నే
ఆహారంగా, వాటి రక్తాన్నే పానీయాలుగా త్రాగాడు. చివరకు సూర్య భగవానుడు
చూడలేక “గిల్గమేశా! ఎందుకిలా పిచ్చి పట్టినవాని వలె తిరుగుతున్నావు?
మరణం ఎవరికైనా తప్పదు కదా! ” అంటూ ప్రశ్నిస్తే “నాకు కావల్సింది దొరికే
వరకూ విశ్రాంతే లేదు. అయినా పర లోకం వెళ్లాక పూర్తిగా విశ్రాంతే కదా. నా
కళ్లు పూర్తిగా మూసుకోక ముందే వెలుగును పూర్తిగా నింపుకోనీ” అంటూ బదులిచ్చి
తన ప్రయాణాన్ని కొనసాగించాడు.

చివరకు గిల్గమేశుడు మాషు పర్వతం దగ్గరకు చేరుకుంటాడు. మాషు పర్వతం

ఉదయాస్తమాన పర్వతాలలో ఒకటి. దానికి కాపలాగా వృశ్చిక జాతి జంట ఉంది. వారు
గిల్గమేశుని అడ్డగించి “ఎక్కడికి” అంటూ ప్రశ్నిస్తారు. ఏ మాత్రం భయపడకుండా
గిల్గమేశుడు “మా పిత్రుదేవుడైన ఉత్తానపిస్తిని దర్శించటానికి వెళ్తున్నాను.
ఎవరైతే దేవ సభలో కూర్చుంటారో, ఎవరైతే మరణాన్ని జయించారో అట్టి
ఉత్తానపిస్తిని దర్శించటానికి వెళ్తున్నాను” అంటూ బదులిచ్చాడు.

ఏ మానవుడూ ఈ దారిలో ఇంతవరకూ వెళ్లలేదు. ఇరవై
నాలుగు గంటలు కటికి చీకటిలో ప్రయాణించాలి. కాంతి రేఖ కూడా ఉండదు. ఒకరికి
ముందు ఏమున్నదో, వెనక ఏమున్నదో అస్సలు కన్పించదు. ” అంటూ గిల్గమేశుని
ప్రయత్నాన్ని వారించాలని చూశారు. కానీ గిల్గమేశుడు లెక్క చెయ్యకుండా
ముందుకే వెళ్లాడు. సూర్యుడు రాత్రిపూట ప్రయాణించే ఆ చీకటి మార్గాన్ని
గిల్గమేశుడు ధైర్యంగా ఇరవై నాలుగు గంటల్లో దాటాడు. అతని ఎదురుగా ఓ
సుందరోద్యానవనం కాంతులీనుతూ నిల్చింది. అందులో అన్నీ దేవ లోకపు వృక్షాలే!
అందులో వజ్రవైఢూర్యాలు కాంతులీనుతూ ప్రకాశించసాగాయి.

ఇంకా కొంచెం ముందుకు వెళ్లాక పూటకూళ్లమ్మ — సింధూరి ఎదురయింది. ఆమె
సముద్రపు ఒడ్డున ఉంది. ఆధ్యాత్మిక దాహం ఉన్న వాళ్ల దప్పిక తీరుస్తుంది.
గిల్గమేశును చూసి అతని వృత్తాంతం అడుగుతుంది. గిల్గమేశుడు తన గురించి,
ఉరుక్కు నగరం గురించి, ఎంకిడుతో స్నేహం గురించీ, ఎంకిడు మరణం గురించీ,
ఎంకిడు గురించి తను రోదించిన ఆరు పగళ్లు, ఏడు రాత్రుల గురించీ,
ఉత్తానపిస్తిని కలుసుకోవాలన్న తన ప్రయత్నం గురించీ వివరిస్తాడు. అంతా విన్న
సింధూరి అతని ప్రయత్నాన్ని ఆపాలని చూస్తుంది. “గిల్గమేశా! దేవాది దేవుడైన
అను మనుష్యులను సృష్టించినప్పుడు అతని మరణాన్ని కూడా ఓ భాగం చేశాడు. ఈ వృథా
ప్రయత్నం మాని జీవితాన్ని ఆనందించు.

నీ కడుపు నిండా తిను

ప్రతి రోజునీ ఆనందించు.

ఆడు, పాడు, పరవశించు

ప్రతి రాత్రీ వసంత రాత్రి చేసుకో

నీ ఒడిలో సేద తీరే భార్యను చేరుకో

నీ చేతిలో ఆడే పిల్లలను చూసుకో” అంటూ పరి పరి విధముల గిల్గమేశుని
ప్రయత్నాన్ని ఆపాలని చూస్తుంది. కానీ గిల్గమేశుడు వినడు. వినకుండా ఉండటమే
కాకుండా సింధూరిని దారి చూపమని అడుగుతాడు.

ఇంతవరకూ ఏ మానవుడూ ఇక్కడకు రాలేదు. ఈ
దారిలో ప్రయాణించలేదు. ఈ దారి బహు కష్టతరమైనది. కేవలం సూర్య భగవానుడే
దాటగలడు. ఇక్కడి నీరు సాక్షాత్ మృత్యువే. కానీ ఒడ్డున ఉర్షాంబి ఉంటాడు.
అతను సహాయపడితే నువ్వు దాటగలవు. లేకుంటే వచ్చిన దారి చూసుకోవటం ఉత్తమం.”
అని చెప్తుంది.

ఒడ్డుకు వెల్తే ఉర్షాంబి కన్పించడు. అక్కడి రాళ్లు కొన్ని ప్రాణం
పోసుకోని గిల్గమేశునిపై దాడి చేస్తాయి. గిల్గమేశుడు తన పదునైన గొడ్డలితో
వాటిని నాశనం చేస్తాడు. ఆ తర్వాత కొంతసేపటికి ఉర్షాంబి అరణ్యం నుండి వచ్చి
గిల్గమేశుని చూసి యోగక్షేమాలు విచారిస్తాడు. గిల్గమేశుడు తన కథ మొత్తం
మొదటి నుండి ఓపిగ్గా వివరిస్తాడు. ఆ తరువాత ఆవలి ఒడ్డుకు చేర్చమని
అడుగుతాడు. కానీ అక్కడ నాశనం అయిన రాళ్లను చూసి ఆశ్చర్యపోయి ఆవలి ఒడ్డుకు
చేరలేమని చెప్తాడు. కానీ ఉర్షాంబి ఎలాగయినా గిల్గమేశునికి సహాయపడాలని
అడవిలోకి వెళ్లి మూడు వందల పొడగాటి కర్రలు తెచ్చి పడవలో వేసుకొని వాటినే
తెడ్డుగా వేస్తూ పడవ నడుపుతాడు. ఆ కర్రలు నీరు తాకితే నాశనం అవుతుంటాయి.
అత్యంత చాకచక్యంగా ఇద్దరూ నీటిని తాకకుండా ఆవలి ఒడ్డుకు చేరుకుంటారు.

ఆవల ఒడ్డున ఉత్తానపిస్తి గిల్గమేశుని చూసి అతని కథ అడుగుతాడు.
మళ్లా  గిల్గమేశుడు మొదటి నుండి మొత్తం కథ చెప్తాడు. అంతా చెప్పి
మృత్యువును జయించే మార్గం అడుగుతాడు. కానీ ఉత్తానపిస్తి అటువంటి మార్గమేదీ
లేదని బదులిస్తాడు.

ఉత్తానపిస్తీ! నిన్ను చూడు. అచ్చం నాలానే
ఉన్నావు. అయినా నువ్వు మృత్యువును జయించావు. నేను మాత్రం ఎందుకు జయించలేను”
అని పరుషంగా ప్రశ్నిస్తాడు.

గిల్గమేశా! నీకోక దేవ రహస్యం చెప్తా,
శ్రద్దగా విను. మహా జల ప్రళయానికి ముందు ఎంకి దేవుడు నాకు దర్శనమిచ్చి నా
గృహాన్ని పడగొట్టి ఒక పడవను తయారు చెయ్యమంటాడు. అన్ని బంధాలు వదులుకొని నా
ప్రాణాన్ని నిలుపుకోమంటాడు. ఏడు అంతస్తుల ఆ పడవను నేను ఆరు రోజుల్లో
నిర్మించాను. అతి కష్టం మీద దాన్ని నిలపెట్టాను. ఏడవ రోజు వర్షం మొదలయింది.
మొత్తం అంతా చీకటిగా మారిపోయింది. ఆరు పగళ్లూ, ఏడు రాత్రులూ గాలి వీచింది.
ఏడవ రోజు సూర్యోదయం అయింది. ఎక్కడ చూసినా నీరే. అందా నిశ్శబ్దం. నిశిర్
పర్వత శిఖరంపై పడవ ఆగింది. ఆ తరువాత కొన్ని రోజులకు అనిల దేవుడు నన్ను చూసి
ఆశ్చర్యపొయ్యాడు. మనుషులందరూ ఈ మహా జల ప్రళయంలో మరణించి ఉండాలి. కాని ఎంకి
దయ వల్ల నేను బ్రతికాను. చివరకు నేను, నా భార్య అను దేవుడి ఆశీస్సులతో
దేవతలతో సమానం అయ్యాము. ”

అంతా విని గిల్గమేశుడు ‘అయితే నా అమరత్వం గురించి దేవ లోకాన్ని
ఎవరు ఒప్పించగలరు’ అంటూ అడుగుతాడు. దానికి ఉత్తానపిస్తి “అయితే నువ్వు ఆరు
పగళ్లు, ఏడు రాత్రులు నిద్ర పోకుండా ఉండు, తర్వాత చూద్దాం” అని
ఆజ్ఞాపిస్తాడు.

కానీ గిల్గమేశుడు ఏడవ రోజు రాత్రి నిద్రపోతాడు. ఏడవ రోజు ఉదయం
ఉత్తానపిస్తి గిల్గమేశుని నిద్ర లేపి నువ్వు విఫలం అయ్యావు అని చెప్తాడు.
దానితో విచార వదనంతో ఉన్న గిల్గమేశుని చూసి ఉత్తానపిస్తి భార్య,
గిల్గమేశునికి ఏదన్నా సహాయం చెయ్యమని అడుగుతుంది.

ఉత్తానపిస్తి గిల్గమేశుని దగ్గరకు వెళ్లి “గిల్గమేశా! ఈ సముద్రం అడుగున
ఒక వేరు ఉంటుంది. అది ఏడు రంగుల్లో , సువాసనతో కూడి ఉంటుంది. అది తింటే
యవ్వనం తిరిగి వస్తుంది.” అని రహస్యం చెప్తాడు. దానితో గిల్గమేశుడు తన
రెండా కాళ్లకూ, రెండు రాళ్లు కట్టుకొని సముద్రం అడుగున నడిచి ఆ వేరు
సంపాదిస్తాడు. పైకి వచ్చాక నేనీ వేరును ముందుగా ఉరుక్కు నగరంలో ఒక
ముదుసలిపై ప్రయోగించి, ఆ తర్వాత స్వీకరిస్తాను. అనుకోని తన దుస్తుల్లో
దాచుకుంటాడు.

ఉత్తానపిస్తి — గిల్గమేశునికి తోడుగా ఉర్షాంబిని పంపుతాడు.
వారిద్దరూ కలిసి తిరుగు ప్రయాణం అవుతూ దారిలో స్నానానికి ఆగినప్పుడు ఆ వేరు
ఒడ్డున ఉంచుతారు. వాసనకు ఆకర్షితమైన ఓ పాము దాన్ని తిని కొత్త చర్మం
పొందుతుంది.

విచార వదనంతో, వట్టి చేతులతో గిల్గమేశుడు ఉరుక్కు నగరానికి తిరిగి వచ్చి
నగరాన్ని చూసి చాలా సంతోషించి, తనలాగా ఎవరూ ఫలితం లేని కార్యాలవైపు దృష్టి
మరల్చకుండా తల గాథను రాజ్యమంతా శిలాక్షరాల్లో లిఖిస్తాడు. ఉర్షాంబికి
గర్వంగా తన నగరాన్నీ, కుడ్యాలను చూపి వాటిలోనే తను అమరుడను అని చెప్పి
సంతోషిస్తాడు.

 

One thought on “గిల్గమేశుడు

  1. ఆసక్తికరమైన కథలు. ఇలాంటి కథలు అంటే చాలా ఇష్టం నాకు. మీ నుంచి మరిన్ని కథలు ఆశిస్తున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.